
రాజధాని, ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో బిజెపి రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసిందని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోను, కేంద్రంలోను బిజెపి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దయెత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం విజయవాడ బాలోత్సవభవన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
రాజధానిపై కోర్టులో కేసుందనే పేరుతో కేంద్రం కప్పదాటు ధోరణి అనుసరించిందని విమర్శించారు. తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిందే తప్ప చిత్తశుద్ధి కనిపించడం లేదని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సరికాదన్నారు. విద్యార్ధి, యువజన సంఘాలు బస్సు యాత్ర నిర్వహించిన తరువాత ప్రత్యేక హోదాపై మరలా చర్చ ప్రారంభమైందని, రాష్ట్ర హక్కులను సాధించేంతవరకు పోరాటం సాగించాలని తెలిపారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపిలు దీనిపై నోరెత్తడంలేదన్నారు.
అదానీ అవినీతి కుంభకోణం నుండి ప్రజల దృష్టిని ప్రక్కదారి పట్టించేందుకు ‘కౌ హగ్’ పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు బిజెపి కొత్తగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిందని, మతోన్మాద కార్యకలాపాలను ప్రమాదకర స్థాయికి తీసుకెళుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర విధానాలతో ఆవులతో సహా పశువుల్ని, వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తూ గోపూజ పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బిజెపి ముద్దులతో ఆరోగ్యంగా ఉండే ఆవులకు కూడా జబ్బులొస్తాయని ఆయన చమత్కరించారు. ఈ రోజు ముద్దులని, రేపు పెళ్ళి చేసుకోవాలని కూడా కోరుతారేమోనన్నారు. ఇది వ్యక్తుల స్వేచ్ఛపై దాడి తప్ప దేశభక్తి కాదన్నారు. ఆవును కూడా తమ రాజకీయాలకు బిజెపి బలిచేస్తుందని విమర్శించారు. బిజెపి దేశాన్ని సుడిగుండంలోకి దించుతోంది. సాంస్కృతిక నిరంకుశత్వాన్ని రుద్దుతున్నది. యువత ఇష్టాయిష్టాలను, స్వేచ్ఛగా బ్రతికే హక్కును కాలరాస్తుందని, యువత దీన్ని చైతన్యంతో ఎదుర్కోవాలని కోరారు.
ప్రజావ్యతిరేక కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది కోతల బడ్జెట్ అని అన్నారు. వ్యవసాయం, సంక్షేమం, ఉపాధిపై కోత విధించారని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను రద్దు చేశారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని, 10.8 శాతానికి చేరుకుందని తెలిపారు. అలాగే అన్ని వ్యవస్థల మీద దాడి చేస్తున్న కేంద్రం న్యాయ వ్యవస్థ మీద కూడా దృష్టి పెట్టిందని తెలిపారు. దీన్ని ప్రశ్నించాల్సిన పార్టీలు కొన్ని అవకాశవాదంగా వ్యవహరిస్తూ న్యాయవ్యవస్థపై నిందలు మోపే చర్యలకు దిగాయని, మన రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కూడా అదే చేస్తుందని తెలిపారు. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుందని తెలిపారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సహకార రంగాన్ని కేంద్ర పరిధిలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని, యూనివర్సిటీల మీద ఆధిపత్యం చలాయించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులను వీసీలుగా నియమిస్తున్నారని తెలిపారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు వామపక్ష ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ఫిబ్రవరి 22 నుండి 28 వరకు ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. దీనిపై కలిసివచ్చే వారిని కలుపుకుపోతామని తెలిపారు.