November 25, 2024
  • వి.శ్రీనివాసరావు, సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి

మార్క్సిస్టు సిద్ధాంత వేత్త, సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రజాశక్తి ప్రధాన సంపాదకులుగా పనిచేసిన మోటూరు హనుమంతరావు 22వ వర్థంతి కార్యక్రమం సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయం (విజయవాడ)లో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు యం.హెచ్‌. చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ మితవాదాన్ని, అతివాదాన్ని ఎదుర్కోవడంలో హనుమంతరావు చేసిన కృషి మరువలేనిది. పార్టీమీద నిర్భంద కాలంలో అజ్ఞాతవాసం, జైలు జీవితం గడిపారు, కడలూరు జైలులో ఉన్నప్పుడే ఆయనమీద పోలీసులు కాల్పులు జరిపినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. ఆయన అనేకమంది కార్యకర్తలను తీర్చిదిద్దారు. రాజకీయంగా ప్రభావితం చేశారు. ఆయన కుటుంబాన్ని కూడా పార్టీ రాజకీయాలవైపు నడిపించారని తెలియజేశారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తి, అనుసరణీయం,. ఆచరణీయమని అన్నారు. ఆయనతో కొద్దిరోజులే పనిచేసినాకూడా అనుభవాలు చాలా నేర్చుకున్నానని, రచయితగా, జర్నలిస్టుగా, పార్టీ ఆర్గనైజర్‌గా అనేక రూపాల్లో ప్రోత్సహించి అండదండలు ఇచ్చారని, యువతరాన్ని కూడా ఎప్పుడూ ప్రోత్సహిస్తుండేవారని, ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, స్ఫూర్తిని పార్టీవైపు నడిపిస్తుంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.మురళీకృష్ణ, జె.జయరాం, ఎ. మాల్యాద్రి, యం.సూర్యారావు, సీనియర్‌ నాయకులు బి.ఆర్‌.తులసీరావు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.