శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జి. ప్రభాకర రెడ్డి ఆధ్వర్యంలో కళాశాల జాతీయ సేవా పథకం సిబ్బంది నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డాక్టర్ జి ప్రభాకర రెడ్డి సిబ్బంది, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన స్వాతంత్య్ర సమర యోధులను, అమర వీరుల ప్రాణ త్యాగాలను కొనియాడారు. వ్యవసాయ రంగంలో ఆధునిక వ్యవసాయ టెక్నాలజీ ద్వారా రైతాంగ అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. కళాశాల బెస్ట్ స్టూడెంట్ అవార్డు ను డి. నాగభూషణ విద్యార్థి కి బహుకరించారు.
తదుపరి ఆజాది కా అమృత మహోత్సవంలో భాగంగా 1971 భారత – పాకిస్థాన్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న విశ్రాంత సైనికులు హవాల్దార్ కేశవులు, నాయబ్ సుబేదార్ సూర్య నారాయణ రావు లను జ్ఞాపికలతో సన్మానించారు. తదుపరి బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థుల చేత నా భూమి నా దేశం పంచ ప్రాణ ప్రతిజ్ఞని చేయించారు. ఎన్. సి. సి. విద్యార్థులు కవాతు నిర్వహించారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు దేశ భక్తి గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం అధికారులు డా. రెడ్డి శేఖర్, డా. సరళ, డా. వాణి, డా. సంతోష్, డా. లీలావతి, ప్రొఫెసర్లు డా. మంజుల, డా. నాగి రెడ్డి, ఫార్మ్ సూపరింటెండెంట్ డా. సునీత, డా చంద్రిక జాతీయ సేవా పథకం వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.